కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) బీఆర్ఎస్ నేతల ఎంక్వయిరీ ఆ పార్టీ కేడర్‌కు సంకటంగా మారింది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సమయంలో ఈ కేసుల విచారణ తెరమీదకు రావడం పార్టీ శ్రేణులకు టెన్షన్ రేకెత్తిస్తున్నది. దీంతో ప్రచారానికి తగిన సమయాన్ని వెచ్చించలేకపోతున్నామనే ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నది. ఎన్నికల టైమ్‌లోనే ఇలాంటివి చోటుచేసుకోవడం వారిని నిరాశకు గురిచేస్తున్నది. పంచాయతీ ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ నుంచి అనుమతి మంజూరైంది. కొన్ని రోజుల పాటు ఆ టెన్షన్ వెంటాడింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. హరీశ్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు జారీ కావడం, ఎంక్వయిరీకి హాజరు కావడం ఊహించని పరిణామంగా మారింది.
జిల్లాల నుంచి సిటీకి కేడర్ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు సిట్ (SIT) పోలీసులు నోటీసు ఇవ్వడం ఆయన అనుచరులకు, అభిమానులకు మింగుడు పడలేదు. ఎంక్వయిరీకి హాజరుకావాల్సి రావడం అయోమయానికి గురిచేసింది. జిల్లాల నుంచి ఆయన అభిమానులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఎంక్వయిరీ జరుగుతున్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిసరాల్లో కేడర్ మోహరించారు. ఇప్పుడు కేటీఆర్ విచారణకు సైతం అదే తరహా వాతావరణం నెలకొన్నది. దీనికి తోడు జిల్లాల నుంచి తరలి రావాల్సిందిగా తెలంగాణ భవన్ నుంచి కేడర్‌కు పిలుపు వెళ్ళింది. దీంతో వారంతా జిల్లాలు విడిచిపెట్టి హైదరాబాద్‌కు తరలుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) సన్నద్ధం కావాలని పలు జిల్లాల్లో కేటీఆర్ రివ్యూలు పెట్టి దిశానిర్దేశం చేసినా తాజా పరిణామంతో నగర బాట పట్టాల్సి వచ్చింది.
ప్రచారానికి తాత్కాలిక బ్రేకులు :
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని, అన్ని స్థాయిల్లోని కేడర్ పకడ్బందీగా ప్రచారాన్ని నిర్వహించాలని కేటీఆర్ నొక్కిచెప్పినా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడానిక వీల్లేకుండా పోయింది. తెలంగాణ భవన్ నుంచే కేడర్‌కు హైదరాబాద్ రావాలంటూ పిలుపు రావడంతో ప్రచారానికి తాత్కాలికంగా బ్రేకులు వేయక తప్పలేదు. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువసీట్లు గెల్చుకోవాలని బీఆర్ఎస్ (BRS) ప్లాన్ చేసింది. కనీసంగా 35 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పోస్టులు ఖాయమనే ధీమాతో ఉన్నది. కానీ ఇప్పుడు కేటీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు పిలవడంతో శ్రేణులన్నీ హైదరాబాద్ రావడంతో మున్సిపాలిటీల్లో ప్రచారం చేయలేక కాంగ్రెస్‌కు గ్రౌండ్ ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
మరికొన్న రోజులూ ఇదే తరహా వాతావరణం :
ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును (Harish Rao) దాదాపు ఏడు గంటల పాటు విచారించిన సిట్.. మరోసారి ఎంక్వయిరీకి రావాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పింది. కేటీఆర్‌ను ప్రశ్నించిన తర్వాత మరోసారి హరీశ్‌రావుకు నోటీసులు జారీ అయ్యే అవకాశముంది. దీంతో అప్పుడు కూడా కేడర్ హైదరాబాద్‌లో మకాం వేయక తప్పదు. ఎన్ని రోజుల పాటు ఈ ఎంక్వయిరీ టెన్షన్ ఉంటుందో… ప్రచారానికి సమయం చిక్కుతుందో లేదో… ఎంక్వయిరీలు పూర్తయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో… ఇలాంటి అనుమానాలు కేడర్‌లో నెలకొన్నది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టలేక సతమతమవుతున్నారు. ప్రచారానికి దూరంగా ఉండడంతో పార్టీ విజయావకాశాలు సన్నగిల్లుతాయామోననే ఆందోళన నెలకొన్నది.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు.. టైమ్ లైన్
Follow Us On : WhatsApp


