కలం, వెబ్‌డెస్క్: హక్కుల కార్యకర్త, విద్యా ప్రదాత, ఆఫ్రికన్ మహిళ గ్రాషా మేషల్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి (Indira Gandhi Peace Prize) లభించింది. ఈ మేరకు 2025 సంవత్సరానికి గాను ‘ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మమెంట్స్, అండ్ డెవలప్మెంట్’ అవార్డుకు ఆమెను ఎంపిక చేసినట్లు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. చదువు, ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, మానవత్వం తదితర రంగాల్లో అత్యంత సవాళ్లను ఎదుర్కొంటూ ఆమె చేసిన కృషికి ఈ అవార్డు అందించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో గ్రాషా మేషల్ చేసిన కృషి, ఆమె నాయకత్వ లక్షణాలు, వివిధ అంతర్జాతీయ సంస్థల్లో అందించిన సేవలు ప్రశంసనీయం అని కేంద్ర భదత్ర విభాగం మాజీ సలహాదారు శివ శంకర్ మీనన్ అధ్యక్షుడిగా ఉన్న జ్యూరీ కమిటీ పేర్కొంది.

ఎవరీ మేషల్?
గ్రాషా మేషల్ (Graca Machel) అక్టోబర్ 17, 1945లో మొజాంబిక్‌లో జన్మించారు. మెథడిస్ట్ స్కూల్స్‌లో గ్రాడ్యుయేషన్ అనంతరం, పోర్చుగల్ రాజధాని లిస్బన్లో పొలిటికల్ సైన్స్, జర్మనీ చదివారు. 1973లో స్వదేశానికి తిరిగివచ్చారు. మొజాంబిక్ లిబరేషన్ ప్రంట్లో చేరి, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1975లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటి విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రి అయ్యారు. దేశ మొదటి ప్రెసిడెంట్ సమోరా మోయిసెస్ మేషల్ను వివాహమాడారు. సమోరా 1986లో చనిపోయాక, దక్షిణాఫ్రికా మొదటి ప్రెసిడెంట్ నెల్సన్ మండేలాను ద్వితీయ వివాహం చేసుకున్నారు.
- మొజాంబిక్‌లో విద్యాభివృద్ధి కోసం గ్రాషా మేషల్ విశేష కృషి చేశారు. బడిలో చేరే పిల్లల శాతాన్ని 40 నుంచి 90శాతానికి చేరేలా చేశారు. పిల్లల్లో దేశాల అంతర్యుద్ధాల ప్రభావంపై 1990లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన కమిటీలో పనిచేశారు. యుద్ధ రంగాలకు వెళ్లి, ఆ ప్రాంతాల్లోని పిల్లల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఆమె శ్రమను గుర్తించి యూఎన్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు ప్రధానం చేసింది.
- ‘గర్ల్స్ నాట్ బ్రైడ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను గ్రాషా స్థాపించారు. బాలికల బాల్య వివాహాలను అరికట్టి, వాళ్లను విద్యావంతులుగా చేసేందుకు పని చేశారు.
- ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడ్వకసీ గ్రూప్‌లో మెంబర్‌గా సేవలందించారు.
- 2010లో గ్రాషా మేషల్ ట్రస్ట్ ఏర్పాటుచేశారు. ఇది మహిళల ఆర్థిక సాధికారత, ఆహార భద్రత, సుపరిపాలనపై పనిచేస్తుంది.
- మహిళలు, పెద్దవాళ్ల ఆరోగ్య సంరక్షణ కోసం చేసిన కృషికి గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్యూహెచ్‌వో) గోల్డ్ మెడల్ పొందారు.
Read Also: పీక్స్‌కి ట్రంప్ పీస్ డ్రామా.. 8 యుద్ధాల వాస్తవాలు ఇవే!
Follow Us On: Youtube


