కలం, వెబ్ డెస్క్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం (Protocol Clash) రాజుకున్నది. స్థానిక ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu), ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) మధ్య ఘర్షణ జరిగినంత పని అయ్యింది. ఎంపీ తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. శంకుస్థాపన కార్యక్రమంలో ముందుగా ఎంపీ మల్లు రవి కొబ్బరికాయ కొట్టారు.
అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ ఎలా కొడతారు? ఆయనకు ఉన్న ప్రొటోకాల్ ఏమిటి? అంటూ ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలపై ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
‘కొబ్బరికాయ కొట్టడానికి ఎవడ్రా నువ్వు’ అంటూ ఎంపీ తనను దూషించాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మల్లు రవి ఎంపీగా (MP Mallu Ravi) గెలిచినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వారు ఆరోపించారు. అలంపూర్ (Alampur) నియోజకవర్గంలో ఇలాంటి ప్రోటోకాల్ వివాదాలు ప్రజా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. చాలా రోజులుగా అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయుడు, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా ఈ మరోసారి ప్రొటోకాల్ వివాదం బయటపడింది.
Read Also: ‘నైనీ బ్లాక్ కుంభకోణం’ కథనం పచ్చి అబద్ధం : దళిత సంఘాలు
Follow Us On: Youtube


