తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు(Coimbatore) నగరంలో దారుణం చోటు చేసుకున్నది. ఎయిర్ పోర్ట్ సమీపంలో తన స్నేహితుడితో మాట్లాడుతున్న ఓ యువతిపై కొందరు దుండగులు దాడి చేశారు. స్నేహితుడిపై తీవ్రంగా దాడి చేసి.. యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనను పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. దుండగులను పట్టుకొనే క్రమంలో పోలీసుల మీద కాల్పులకు తెగబడ్డారు. దీంతో నిందితులపై కాల్పులు జరిపి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు(Tamil Nadu)లోని శివగంగ జిల్లాకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ అనే ముగ్గురు యువకులు సోమవారం రాత్రి కోయంబత్తూరు(Coimbatore) ఎయిర్‌పోర్ట్ సమీపంలో తిరుగుతున్నారు. ఆ సమయంలోనే ఓ యువతి కారు పక్కన తన స్నేహితుడితో మాట్లాడుతోంది. ఈ జంటపై దుండగులు ఆకస్మాత్తుగా దాడి చేశారు. ఆ తర్వాత ఆ యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం కావడంతో కోయంబత్తూరు పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. తెల్లవారుజామున వెల్లకినార్ ప్రాంతంలోని ఓ ఆలయ సమీపంలో ముగ్గురూ దాక్కున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ముందుకెళ్లగా, నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో పోలీసులు కూడా ఎదురు దాడి చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు నిందితులు కాళ్లలో గాయపడ్డారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. విచారణలో భాగంగా నిందితులపై ఇప్పటికే హత్య, దోపిడీ, దాడి వంటి ఐదు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతను కాపాడటంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: విడదల రజనీ అనుచరుల భారీ మోసం ..
Follow Us On : Instagram

