ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లెలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పర్యటించారు. ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కనాల్) టన్నెల్ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. “ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 1983లోనే ఆమోదం పొందింది. కానీ, నాలుగు దశాబ్దాలు గడిచినా పూర్తికాలేదు. ఇది రాష్ట్రానికి అవమానకరం. ఈ టన్నెల్ పూర్తయితే నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు సాగునీటి వరం లభిస్తుంది,” అని అన్నారు.
టన్నెల్(SLBC Tunnel) పనుల్లో సాంకేతిక అవాంతరాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బోర్ మిషన్ పనుల్లో కష్టాలు ఉన్నా, ఏ అవాంతరం వచ్చినా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. “కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో కేవలం 10 కిలోమీటర్ల టన్నెల్ మాత్రమే పూర్తి చేసింది. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు రూ.1.06 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించగా, ఎస్‌ఎల్‌బీసీపై మాత్రం దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో పెద్దగా కమీషన్లు రావని భావించారు,” అని ఆరోపించారు.
అలాగే, “ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan) పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణపై దృష్టి పెట్టగా, కేసీఆర్(KCR) మాత్రం నిశ్శబ్దంగా చూశారు. దీంతో తెలంగాణకు కృష్ణా నీరు సరిగ్గా దక్కలేదు. ఈ నిర్లక్ష్యమే నల్లగొండ ప్రజల దురదృష్టానికి కారణమైంది.” అని అన్నారు. మొత్తం మీద, రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా ఉందని చెబుతుండగా, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు మళ్ళీ తెరమీదకు వచ్చాయి.

Read Also: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై రాజకీయం.. అధికార, విపక్షాల విమర్శలు
Follow Us On : Instagram

