కలం, వెబ్‌డెస్క్: శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం చోరీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మంగళవారం ఒకేసారి కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 21 చోట్ల సోదాలకు దిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(PMLA) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ఈ తనిఖీలు చేస్తోంది. దేవాలయ బంగారం వ్యవహారంలో అవకతవకలు, అడ్మినిస్ట్రేషన్ లోపాలు, సరైన ఆడిటింగ్ పత్రాలు లేకపోవడం వంటివి మనీలాండరింగ్‌కు దారి తీసినట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డ్(టీబీటీ) చైర్మన్ పద్మకుమార్తోపాటు ఇతర నిందితులైన మురారి బాబు, వాసు, బంగారు వ్యాపారి గోవర్ధన్, పంకజ్ బండారిల ఇళ్లు, అనుబంధ ప్రాంతాలతోపాటు తిరువనంతపురంలోని టీడీబీ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జరుపుతోంది.
కాగా, శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయంలో గర్బగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకులకు సంబంధించిన బంగారు తాపడాలకు మరమ్మతుల పేర్లతో నిందితులు బంగారాన్ని స్వాహా చేయడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటపడడంతో కేసు నమోదు అయ్యింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ప్రధాన నిందితునితోపాటు, ఆలయ పూజారి, మరో 21 మందిని సిట్ అరెస్ట్ చేసింది.


