కలం, వెబ్‌డెస్క్: సైబర్ నేరాల్లో బాధితులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ‘సి–మిత్ర’ (C Mitra) యాప్‌కు అద్భుత స్పందన వస్తోంది. ఈ యాప్‌ను ప్రారంభించిన పది రోజుల్లోనే సైబర్ నేరాల గురించి ఆన్లైన్ ద్వారా వెయ్యి మంది ఫిర్యాదు చేయగా, ఏకంగా వంద ఎఫ్ఐఆర్లు రికార్డయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు వెల్లడించారు.
సాధారణంగా సైబర్ నేరాల కేసుల్లో బాధితులు పోలీసు స్టేషన్‌కు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. పరువు పోతుందని ఫిర్యాదుకు వెనకడుగు వేస్తుంటారు. అలాగే స్టేషన్లో ఫిర్యాదు ప్రక్రియ కూడా కష్టమైన పనే. అందువల్ల చాలా మంది స్టేషన్ గడప తొక్కరు. ఈ పరిస్థితి సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది. దీనిని అడ్డుకోవడానికి, బాధితులకు అండగా ఉండడానికి తెచ్చిందే ‘సి–మిత్ర’ యాప్. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ సీపీ సజ్జనార్ దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో పది రోజుల్లోనే వెయ్యి ఫిర్యాదులు, వంద ఎఫ్ఐఆర్లు నమోదవడం సి–మిత్రకు లభిస్తున్న స్పందన తెలియజేస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
సి–మిత్ర (C Mitra) యాప్ కోసం హైదరాబాద్ పోలీసులు 24 మందితో కూడిన ప్రత్యేక డెస్క్ ఏర్పాటుచేశారు. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. సైబర్ నేరం గురించి 1930 హెల్ప్‌లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా సమాచారం అందిన వెంటనే సి–మిత్ర బృందం బాధితులను సంప్రదిస్తుంది. వివరాలను సేకరిస్తుంది. అనంతరం ఏఐ ద్వారా చట్టపరంగా సరైన ఫిర్యాదు ముసాయిదా తయారుచేస్తుంది. దీనిని బాధితులకు వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిస్తారు. బాధితులు దీనిని ప్రింట్ తీసుకొని, సంతకం చేసి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఇది అందిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ సిద్ధం చేసి నేరుగా బాధితుల మొబైల్‌కు పంపిస్తారు.


