కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో (IND vs NZ) భారత్ ఓటమిపాలయింది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. ఆ తర్వాత రెండు వన్డేల్లో చేతులెత్తేసింది. మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ బాదినా లాభం లేకుండా పోయింది. కాగా ఈ వన్డే సిరీస్‌లో భారత్ ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ సదగొప్పన్ రమేష్ (Sadagoppan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండోర్ వన్డేలో ఐదు వికెట్లకు రెండు పరుగుల స్థితి నుంచి న్యూజిలాండ్‌ను 337 పరుగులు చేయనిచ్చిన దశలోనే భారత్ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిందని అన్నారు. అదే భారత్ చేసిన మొదటి పెద్ద తప్పని ఆయన తెలిపారు.
భారత్ ఓటమికి అసలు కీలక మలుపు కేఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడమేనని రమేశ్ (Sadagoppan Ramesh) స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ తరహాలో రాహుల్ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. రాహుల్ సెటిల్ అయి విరాట్‌తో కలిసి భాగస్వామ్యం కొనసాగించి ఉంటే భారత్ లక్ష్యాన్ని సులభంగా చేధించేదని అభిప్రాయపడ్డారు. రెండో వన్డేలో అజేయంగా 112 పరుగులు చేసిన రాహుల్ మూడో మ్యాచ్‌లో ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టును కోల్పోయింది. విరాట్ కోహ్లీ శతకం నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రాణా అర్ధ శతకాలు ఫలితం ఇవ్వలేకపోయాయి.
ఈ ఓటమితో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో తొలిసారిగా వన్డే సిరీస్ కోల్పోయి మరో అనవసర రికార్డు నమోదు చేసుకుంది. ఒకప్పుడు భారత్‌కు కోటగా ఉన్న స్వదేశ వేదిక ఇప్పుడు సవాలుగా మారిందని రమేశ్ వ్యాఖ్యానించారు. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ బలహీన జట్టుతో ఆడిందని గుర్తు చేసిన రమేశ్ టీ20 సిరీస్‌కు మాత్రం వారి పూర్తి జట్టు బరిలోకి దిగుతుందని హెచ్చరించారు. జనవరి 21 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ భారత్‌కు మరింత కఠిన పరీక్షగా మారనుందని తెలిపారు.
Read Also: ప్లేయర్ల విషయంలో పీఎస్ఎల్ కీలక నిర్ణయం.. చరిత్రలో తొలిసారి
Follow Us On: Sharechat


