కలం, నల్లగొండ బ్యూరో : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 11.38 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటివరకు 265 కోట్ల మంది ఉచిత బస్సులో ప్రయాణం చేసినట్లు చెప్పారు.
సమాజంలో పేద వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, సన్న బియ్యం ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. నల్గొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద 5 కోట్ల రూపాయలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంప్ రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాదిలోపు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి తెలిపారు. పిల్లలను బాగా చదివించుకోవాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేయవద్దని సూచించారు. ఎవరైనా ఆర్థిక స్తోమత లేక పెద్ద చదువులు చదివించలేకపోతే తనను సంప్రదిస్తే సహకారం అందిస్తానని భరోసానిచ్చారు.
Minister Komatireddy | ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడా పాఠశాలను 13 కోట్ల రూపాయలతో ప్రైవేట్ పాఠశాలలకు మించి అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నామని, త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐటిపాములలో 50 లక్షల రూపాయలు వెచ్చించి 50 మంది మహిళలకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయించామని, దాని ద్వారా వారు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. మహిళలును కోటీశ్వరులను చేసే వరకు వారి వెంటే ఉంటామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, ఆర్డిఓ వై. రెవెన్యూ అదనపు కలెక్టర్, డిఆర్డిఓ, మెప్మా పీడీ, మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, గృహ నిర్మాణ శాఖ పీడీ, తదితరులు పాల్గొన్నారు.


