కలం, తెలంగాణ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల)ను కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు! అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నది(Back To Ballot)!! కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈవీఎంలతో గోల్ మాల్ చేస్తున్నదని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని హస్తం నేతలు మొదటి నుంచీ మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏకంగా దీనిపై ఉద్యమాన్నే చేపట్టారు. అయినా.. కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈవీఎంలతోనే (EVM) జనరల్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నది.
దీంతో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా ఈవీఎంలకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలను తప్పనిసరిగా బ్యాలెట్ (Ballot Paper) విధానంలోనే నిర్వహించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాలెట్‌తోనే బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలోనూ మున్సిపల్ ఎన్నికలను ఇదే విధానంలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నది.
గ్రేటర్ బెంగళూరులో బ్యాలెట్..
మే నెలాఖరులో గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే.. ఈసారి బ్యాలెట్ పేపర్ (Back To Ballot) తోనే ఎలక్షన్స్ నిర్వహిస్తామని కర్నాటక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జీఎస్ సంగ్రేషి సోమవారం ప్రకటించారు. గతంలో ఈవీఎంలను ఉపయోగించినప్పటికీ ఇప్పుడు మళ్లీ బ్యాలెట్‌ను ఉపయోగించడం ఏమిటని మీడియా ప్రశ్నించగా.. “బ్యాలెట్‌ను వాడొద్దని ఎక్కడా లేదు కదా? ఈవీఎంలనే వాడాలని కూడా ఎక్కడా లేదు కదా?! మేం పలు స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాం. జీబీఏ ఎన్నికలను కూడా అలాగే జరపాలనుకుంటున్నాం. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. కీలకమైన బెంగళూరు ఎన్నికలనే బ్యాలెట్‌తో నిర్వహించేందకు సిద్ధమైన ఎస్ఈసీ.. తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను (Telangana Municipal Elections) బ్యాలెట్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు కేబినెట్ కూడా ఆదేశించింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం 7,500 బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. 2020 మున్సిపల్ ఎన్నికలు కరోనా వంటి కారణాల వల్ల బ్యాలెట్ విధానంలో జరిగాయి. అంతకుముందు 2014లో మాత్రం ఈవీఎంలతో జరిగాయి. ఈసారి కూడా ఈవీఎంలతో నిర్వహిస్తారని ఇతర పార్టీలు భావించినప్పటికీ.. బ్యాలెట్ విధానంలోనే ముందుకు వెళ్లాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
మహారాష్ట్రలో ఈవీఎంలు..
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంల (EVM) ను వినియోగించారు. దాదాపు పెద్ద మొత్తంలో మున్సిపల్ స్థానాలను రాష్ట్రంలోని అధికార బీజేపీ కైవసం చేసుకుంది. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని, మహారాష్ట్రలో బీజేపీ కుట్ర పన్నిందని అక్కడి ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. ఆ మధ్య జరిగిన కేరళ స్థానిక ఎన్నికలను కూడా ఈవీఎంలతోనే జరిపారు. కానీ.. కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ, కర్నాటకలో మాత్రం ’బ్యాక్ టు బ్యాలెట్‘ విధానం అమలవుతున్నది.
సొంత రాష్ట్రాలను చూపి దేశవ్యాప్త పోరు..
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్నే అమలు చేయాలన్న పోరాటానికి తమ సొంత రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటకను ఆదర్శంగా చూపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. బ్యాలెట్ విధానంతోనే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని.. ఇందుకు ఈ రెండు రాష్ట్రాలే ఉదాహరణ అని చాటిచెప్పనుంది. తమ పార్టీ పాలిత రాష్ట్రం హిమాచల్‌లోనూ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నది.
తమ భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇదే విధానంతో ముందుకు వెళ్లేలా ఆయా పార్టీలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈవీఎంలు లేకపోతే కేంద్రంలో బీజేపీ మళ్లీ పగ్గాలు చేపట్టేదే కాదని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఇప్పటికే ‘ఓట్ చోరీ’ పై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ‘బ్యాక్ టు బ్యాలెట్’ (Back to Ballot) కోసం కూడా పోరాటం ఉధృతం చేయనున్నారు.


