కలం, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) కి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా ఈ నెల 26న జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించే అవకాశం ఆయనకు లభించింది. ఈ మేరకు కీరవాణి తన ‘ఎక్స్’ అకౌంట్లో వెల్లడించారు.
‘అందరికీ వందేమాతరం! ప్రతిష్టాత్మక గీతం వందేమాతరానికి 150 ఏళ్లు అవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం నాకు లభించడం ఎంతో గర్వంగా, గౌరవంగా ఉంది. ఈ మహత్తర కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 2,500 మంది కళాకారులు పాల్గొంటారు. మన దేశ ఆత్మను ప్రతిబింబించే ఈ వేడుకను ఆస్వాదించండి. వందేమాతరం’ అంటూ తన ట్వీట్లో కీరవాణి పేర్కొన్నారు.
కాగా, రిపబ్లిక్ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల రిహార్సల్స్ ఇప్పటికే ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మొదలయ్యాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డ కోస్టా, యూరోపియన్ కమిషన్ ఛైర్మన్ ఉర్సులా వాన్ డర్ లియెన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వీళ్లు జనవరి 27 నుంచి జరగబోయే ఈయూ–ఇండియా భాగస్వామ్య సదస్సులోనూ ప్రతినిధులుగా పాల్గొంటారు.

Read Also: శర్వానంద్ సినిమాకు థియేటర్స్ పెంపు
Follow Us On : WhatsApp


