కలం, తెలంగాణ బ్యూరో : పదేండ్ల క్రితం నాటి జన్వాడ భూ కుంభకోణం కేసు (Janwada Land Scam Case) మరోసారి తెరమీదకు రానున్నది. నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో విచారణ జరగనున్నది. సుమారు 97 ఎకరాల భూముల క్రయ విక్రయాలపై సరికొత్త విషయాలను న్యాయవాది కోర్టుకు వివరించనున్నారు. దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూముల లావాదేవీల వెనక పలు ప్రధాన పార్టీల పెద్దల పేర్లు వెలుగులోకి రానున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్లు, ఫేక్ డాక్యుమెంట్లు, ఇందుకు సహరించిన అప్పటి రెవెన్యూ అధికారుల పేర్లు సైతం విచారణ సందర్భంగా తెరపైకి రానున్నాయి. భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగిందని, ఆ డబ్బుతోనే ఈ భూముల కొనుగోళ్ళు జరిగాయని ధృవీకరించే కొన్ని అంశాలను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయనున్నారు.
గతంలోనే సీఐడీ విచారణ జరిపి చార్జిషీట్ ఫైల్ చేసిన తర్వాత సీబీఐ కూడా ఈ కేసును టేకప్ చేసింది. చార్జిషీట్ దాఖలు చేయడంతో పలువురు నిందితులకు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కానీ కొన్ని కారణాలతో దర్యాప్తు అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇదే విషయాన్ని పిటిషనర్ అల్లాడి అభినవ్ స్పెషల్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. సత్యం రామలింగరాజు సహా ఆయన భార్య నందిని రాజు, తేజరాజులను మళ్ళీ విచారించాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు కోర్టును కోరే అవకాశమున్నది. ఇప్పటికే ఈడీ తరపు న్యాయవాదికి స్పెషల్ కోర్టు నోటీసులు ఇచ్చి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా జనవరి 19 డెడ్‌లైన్ విధించింది. ఆ ప్రకారం కేసు (Janwada Land Scam Case) విచారణ సోమవారం జరగనున్నది.
సర్వే నెంబర్లతో సంబంధం లేకుండా అప్పటి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వుల కాపీలను న్యాయవాది కోర్టుకు సమర్పించే అవకాశమున్నది. మొత్తం 213 మంది నిందితులను అప్పట్లోనే ఈ భూ కుంభకోణంలో సీఐడీ, సీబీఐలు పేర్కొన్నాయి. దాదాపు 275 కంపెనీలు ఈ లావాదేవీల వెనక ఉన్నట్లు సీబీఐ సైతం అప్పట్లో గుర్తించి చార్జిషీట్‌లో ప్రస్తావించింది. అన్నీ ప్రైవేటు భూములే కావడంతో 1956 నాటి ఖాస్రా పహాణీల్లోని వివరాలను ప్రస్తావించి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా పార్టీల పెద్దల సహకారంతో క్రయ విక్రయాలు జరిగాయన్నది న్యాయవాది బలమైన అనుమానం. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పొలిటీషియన్లు సహా రెవెన్యూ అధికారుల ద్వారా చేతులు మారాయనే వాదనను సైతం న్యాయవాది వినిపించనున్నట్లు తెలిసింది. ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ: రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


