ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లో తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది. వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొనేందుకు బారులు తీరారు. ఆలయద్వారాలు తెరవడంతో ఒక్కసారిగా భక్తులు పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని వెంటనే అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని కాశీబుగ్గ, సుంకరపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కొందరిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనసాగుతున్న సహాయకచర్యలు
సమాచారమందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిలో చాలామంది స్పృహ తప్పి పడిపోవడంతో రెస్క్యూ సిబ్బంది వారిని బయటకు తీసుకువచ్చి వైద్యసాయం అందిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాల వద్ద ఆర్తనాదాలు చేస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఏమిటి?
భక్తుల రద్దీని అదుపులో ఉంచేందుకు పోలీసులు, దేవస్థాన అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం వేళ స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లు భారీగా ఉన్నాయి. ఒక్కసారిగా గేట్లు తెరచడంతో ప్రజలు ఉధృతంగా ముందుకు దూసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కాశీబుగ్గ(Kashibugga) వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఈ దురదృష్టకర ఘటన మనసును కలచివేసింది. భక్తుల ప్రాణనష్టం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను,” అని పేర్కొన్నారు. అంతేకాక, ఆయన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం సాధించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను ఆస్పత్రుల్లో చూసి వైద్యసేవలను సమీక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Read Also: ‘మొంథా’ను సమర్థంగా ఎదుర్కొన్నాం : సీఎం చంద్రబాబు
Follow Us On : Instagram

