epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పాలేరులో రూ. 362 కోట్లతో అభివృద్ధి: పొంగులేటి

కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 362 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోనీ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోగల మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.

పాలేరు గడ్డపై అభివృద్ధి పండుగ

మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు.. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారని పొంగులేి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే కూసుమంచిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పొంగులేటి తెలిపారు.

తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ..

రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) నిర్వహించనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. “గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం మా అలవాటు కాదు.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమిది” అని స్పష్టం చేశారు.

కుంభమేళాకు మించి మేడారం ఏర్పాట్లు

సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>