కలం, వెబ్ డెస్క్: ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలుగు రాష్ట్రాల్లో ఓ కామెడీ నేత. ఆయన నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారుతూ ఉంటారు. మీడియా కూడా కేఏ పాల్(KA Paul) ను అలాగే ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఎన్నో యుద్ధాలు ఆపానని.. తనకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులతో సంబంధాలు ఉన్నాయని ఆయన చెబుతూ ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే తాజాగా కేఏపాల్ చేసిన ఓ ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ (అసెంబ్లీ)లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మద ప్రబోధకుడు కేఏ పాల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సమృద్ధి కోసం ఈ రెండు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
కాన్సాస్ స్టేట్ సెనేట్ సభ్యులను ఉద్దేశించి పాల్ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 ప్రధాన యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ యుద్ధాల కారణంగా ట్రిలియన్ల డాలర్ల విలువైన సంపద వృథా అవుతోందని చెప్పారు. యుద్ధాలు మానవాళిని నాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెరికా, భారత్ మధ్య స్నేహబంధం మరింత బలపడాలని, ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని పాల్ ప్రార్థించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
యుద్ధాలు ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని, సంభాషణ, పరస్పర గౌరవం, మానవీయ దృక్పథంతోనే ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి కోసం భారత్, అమెరికా కలిసి ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని డా. పాల్ తెలిపారు.


