కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, భారత సైన్యం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అధ్యక్షతన జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఉన్న సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని (Southern Command Headquarters) హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్మీ ఉన్నతాధికారులను ఆయన కోరారు.
తెలంగాణపై కేంద్రం, ఆర్మీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లు ఉండగా, తెలంగాణలో గత పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తక్షణమే సైనిక్ స్కూల్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడబోదని, వికారాబాద్లో లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 3 వేల ఎకరాలు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకుందని సీఎం గుర్తు చేశారు.
ఆర్మీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, పరిపాలనాపరమైన చిక్కుముడులను విప్పేందుకు నిరంతర చర్చలు ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు. ఈ చర్చల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్మీ తరపున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.
Read Also: ఎమ్మెల్యే పోచారం తనువు బీఆర్ ఎస్ లో.. మనసు కాంగ్రెస్ లో..!
Follow Us On: Sharechat


