కలం, నిజామాబాద్ బ్యూరో : మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి (Srinivas Reddy) శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం కాంగ్రెస్ లో చేరినట్టు సరైన ఆధారాలు లేవని బీఆర్ ఎస్ లోనే ఉన్నారని.. అనర్హత వేయలేమని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఈ విషయం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి గుడ్ న్యూస్ అంటున్నారు ఆయన వర్గీయులు. బీఆర్ ఎస్ పార్టీ తరఫున పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ (Banswada) ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ ఎస్ కు దూరంగా ఉంటున్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డిపై (Srinivas Reddy) అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ ఎస్ నేతలు పట్టుబట్టారు. కానీ ఈరోజు క్లీన్ చిట్ రావడంతో బాన్సువాడ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే పోచారం తనువు బీఆర్ఎస్ లో ఉంటే మనసు కాంగ్రెస్ లో ఉందని జిల్లా రాజకీయ నాయకులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పోచారం తన వర్గీయులను గెలిపించుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన.. ఆ పదవిలోనే కొనసాగుతారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. మరి ఈ విషయం మీద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Read Also: మొన్న రేవంత్.. నేడు చంద్రబాబు
Follow Us On: X(Twitter)


