కలం, వెబ్‌డెస్క్: నిరుడు జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం (Air India Crash) కేసులో ట్విస్ట్. ఫ్లైట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (Sumeet Sabharwal) బంధువుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) నోటీస్ పంపింది. దీనిపై పైలెట్ల సమాఖ్య.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్ (ఎఫ్ఐపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఏఏఐబీకి లీగల్ నోటీస్ ఇచ్చింది. దీంతో ఈ వివాదం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వద్దకు చేరింది.
అసలేం జరిగిందంటే..
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి నిరుడు జూన్ 12న లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎ171 విమానం గాల్లోకి ఎగిరిన సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని కెప్టెన్‌తో సహా 12 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు చనిపోగా, ఒక్క ప్యాసింజర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడడంతో 19 మంది మరణించారు. ఈ దుర్ఘటనపై (Air India Crash) ఏఏఐబీ దర్యాప్తు జరుపుతోంది.
ఇందులో భాగంగా.. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ బంధువైన వరుణ్ ఆనంద్‌ను విచారణకు రమ్మంటూ నోటీస్ జారీ చేసింది. కాగా, ఆనంద్ సైతం పైలెట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నోటీస్ విషయం తెలిసి పైలెట్ల సమాఖ్య మండిపడింది. ఆనంద్‌కు ప్రత్యక్షంగా, టెక్నికల్‌గా, ఎక్స్‌పర్ట్‌గా.. ఏ విధంగానూ దుర్ఘటనతో సంబంధం లేదని, అలాంటప్పుడు ఎలా నోటీస్ ఇస్తారని ప్రశ్నించింది. అంతర్జాతీయ పౌ విమానయాన సంస్థ(ఐసీఏం) నిబంధల ప్రకారం పైలెట్ కుటుంబసభ్యులను విచారణకు పిలవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అవసరమైతే జూమ్ కాల్ విచారణకు ఆనంద్ హాజరవుతారని చెప్పింది.
కాగా ఈ కేసు విచారణలో ఇంతముందు సైతం ఏఏఐబీ తీరుపై విమర్శలు వచ్చాయి. ప్రమాదం గురించి ప్రాథమిక నివేదికలో.. కెప్టెన్ సుమీత్, ఫ్లైట్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్. మధ్య జరిగిన సంభాషణను ఏఏఐబీ వెల్లడించడం దీనికి కారణం. కాక్‌పిట్ ఆడియోను విశ్లేషించినప్పుడు అందులో ఒక పైలెట్ ‘నువ్వెందుకు కట్ చేశావ్?’ అని ప్రశ్నించగా, మరో పైలెట్ ‘నేను చేయలేదు’ అని జవాబిచ్చినట్లు నివేదిక పేర్కొంది.
దీంతో ఈ ప్రమాదానికి కెప్టెన్ తప్పిదమే కారణమని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. దీని మీద అభ్యంతరం చెబుతూ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్, పైలెట్ల సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక నివేదికపై సుప్రీం ‘దురదృష్టకరం’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించింది.
Read Also: నక్సలైట్లకు మరో ఎదురుదెబ్బ.. భారీగా లొంగుబాటు
Follow Us On: Youtube


