కలం, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల అరెస్టు (Journalists Arrest) వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏ తప్పూ చేయకపోతే విచారణకు సహకరిస్తామని చెప్పి, రాత్రికి రాత్రే బ్యాంకాక్ ఎందుకు పారిపోతున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకే బ్యాంకాక్‌కు టిక్కెట్లు బుక్ చేసుకుని, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ, మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఈ క్రమంలోనే ప్రముఖ టీవీ ఛానెల్ రిపోర్టర్లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు. ‘మేము ఎక్కడా డోర్లు పగలగొట్టలేదు.. చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా పట్టుకొస్తామని హెచ్చరించారు.
ఆధారాలు లేకుండా మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరచడం క్రూరత్వమని సజ్జనార్ (Sajjanar) మండిపడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఇలాంటి విమర్శలు వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయన్నారు. స్త్రీలను గౌరవించాల్సింది పోయి, అవమానకరంగా వార్తలు వేయడం వల్లే ఈ కేసులు నమోదయ్యాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: రాహుల్ హామీ బేఖాతర్.. నల్లగొండలో ‘రెడ్డి’లదే పెత్తనం!!
Follow Us On: Sharechat


