కలం, వెబ్‌డెస్క్: భారత పాస్‌పోర్ట్ (Indian Passport) వాల్యూ పెరిగింది. నిరుడుతో పోలిస్తే ఐదు స్థానాలు మెరుగైంది. ఈ మేరకు ‘ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పాస్‌పోర్ట్ వాల్యూను ఈ సంస్థ లెక్కగట్టి ఏటా జాబితా ప్రచురిస్తుంది. ఈ ప్రకారం 2026 లిస్ట్‌ను బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో భారత పాస్‌పోర్ట్ 80వ స్థానం దక్కించుకుంది. కాగా, 2025లో 85వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం ఐదు స్థానాలు ఎగబాకింది. భారత పాస్‌పోర్ట్‌తో 55 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ కింద వెళ్లొచ్చు. అయితే, నిరుడు 85వ స్థానంలో ఉన్నప్పటికీ 57 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ మీద ప్రయాణించే వెళ్లే అవకాశం ఉండేది.
జాబితాలో భారత్ (Indian Passport) తోపాటు నైజీరియా, అల్జీరియా పాస్‌పోర్ట్‌లు 80వ స్థానం దక్కించుకున్నాయి. ఇక, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సింగపూర్ పాస్‌పోర్ట్ టాప్‌లో నిలిచింది. కొరియా, జపాన్ రెండో స్థానం పంచుకున్నాయి. టాప్–3లో మూడూ ఆసియా దేశాలే కావడం గమనార్హం. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 227దేశాల్లో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జపాన్, కొరియా పాస్‌పోర్ట్‌లతో 188 దేశాలకు వెళ్లొచ్చు. జాబితాలో మూడో స్థానం డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లక్సెంబర్గ్ పంచుకున్నాయి. వీటి పాస్‌పోర్ట్‌లతో 186 దేశాలు వీసా లేకుండా చుట్టిరావచ్చు. నిరుడు 12వ స్థానానికి దిగజారిన అమెరికా పాస్‌పోర్ట్ ఈసారి మళ్లీ తన పాత స్థానం 10కి చేరింది. అన్నింటికంటే చివరిలో ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్ట్ (101) ఉంది. మన దాయాది దేశం పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 98వ స్థానం దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా 199 దేశాల పాస్‌పోర్ట్‌లను విశ్లేషించి ఈ జాబితాను హెన్లీ తయారుచేసింది.


