కలం వెబ్ డెస్క్ : ఏపీలో భోగి పండుగ(Bhogi Festival) వైసీపీ(YCP) వర్సెస్ టీడీపీ(TDP) అన్నట్లుగా సాగుతోంది. పోటాపోటీగా ఇరు పార్టీల నేతలు భోగి మంటల్లో పత్రాలు కాల్చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన భోగి సంబరాల్లో ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni) పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ హయాంలో వైయస్ జగన్(YS Jagan) ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల ప్రతులను టీడీపీ నేతలతో కలిసి భోగి మంటల్లో వేశారు. వైసీపీ నుంచి విముక్తి పొంది, తమ భూములను లాక్కున్న జగన్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో నగరంలోనే సంక్రాంతి సంబరాలు ఎక్కువగా జరుగుతున్నాయని చిన్ని పేర్కొన్నారు. వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల జీవోలను మంటల్లో వేస్తున్నారన్న దానిపై స్పందిస్తూ.. జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలను మేం కూడా మంటల్లో వేశామన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో స్థలాలన్నీ ఆక్రమించేసుకొని, తన ఫోటోలతో పాస్ పుస్తకాలు ఇచ్చారని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే రాజముద్రతో పాస్ పుస్తాకాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జగన్ ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలను మంటల్లో తగలబెట్టేస్తున్నామని వెల్లడించారు.


