కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల(Handloom Weavers) రుణమాఫీ పథకం కింద అదనంగా రూ.16.27 కోట్ల నిధులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టెక్స్టైల్ విభాగం(Textile Department) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి రూ.33 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో పాటు మాఫీ చేయాల్సిన మొత్తం రూ.48.30 కోట్లకు చేరింది. దీంతో కేటాయించిన బడ్జెట్ సరిపోకపోవడంతో అదనంగా నిధులు మంజూరు చేయాలని చేనేత, టెక్స్టైల్స్ కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2025–26 బడ్జెట్ అంచనాల నుంచి రూ.16,27,60,000 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పథకం అమలుకు అవసరమైన పరిపాలనా ఖర్చులు కూడా రెండు శాతం ఉన్నాయి. ఈ నిధులను డ్రా చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి చేనేత, టెక్స్టైల్స్ అండ్ అప్పారెల్ ఎక్స్పోర్ట్ పార్కుల కమిషనర్‌కు ప్రభుత్వం అధికారాలు కల్పించింది. ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ కూడా సమ్మతి తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికులకు రుణభారం నుంచి ఉపశమనం లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేనేత రంగానికి పెద్ద ఊరటగా మారనుందని అధికారులు చెబుతున్నారు.


