కలం వెబ్ డెస్క్ : హర్యానా(Haryana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై ‘హరిజన’(Harijan), ‘గిరిజన’(Girijan) అనే పదాలను అధికారికంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు హర్యానా మానవ వనరుల శాఖ (Human Resources Department) ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)ను సూచించేందుకు హరిజన, గిరిజన అనే పదాలు వాడటం సరికాదని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. భారత రాజ్యాంగంలో ఈ పదాలు లేవని, కేవలం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అనే పదాలనే ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1990 ఆగస్టు 16న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, కొన్ని శాఖలు ఇప్పటికీ పాత పదాలనే వాడుతున్నాయని ప్రభుత్వం గుర్తు చేసింది. దీంతో తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసి, ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు వర్తించనున్నాయి. జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లకు ప్రభుత్వ విభాగాధిపతులకు, బోర్డులు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలు, విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, లేఖలు, ఉత్తర్వులు, నోటీసులు, నివేదికలు, ఇతర అధికారిక పత్రాల్లో హరిజన, గిరిజన అనే పదాలు వాడకూడదు.


