epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వీబీ-జీ రామ్ జీ పథకం అద్భుతం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం (VB G Ram Ji Scheme) గ్రామీణ భారతావనిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కొనియాడారు. కరీంనగర్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం విశేషాలను వివరించారు. గ్రామీణ పేదలకు ఏడాదికి ఖచ్చితంగా 125 రోజుల పని కల్పించడంతో పాటు, గ్రామానికి శాశ్వత ఆస్తులను సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ కింద కేవలం గుంతలు తవ్వే పనులకే పరిమితమయ్యారని, కానీ ఈ కొత్త విధానం ద్వారా గ్రామ సభల నిర్ణయం మేరకు అభివృద్ధి పనులు జరుగుతాయని వెల్లడించారు.

వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం పెద్ద ఉపశమనం కలిగిస్తుందని మంత్రి తెలిపారు. సాగు పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు కల్పించామని, దీనివల్ల రైతులకు కూలీల కొరత ఉండదని వివరించారు. మొత్తంగా ఏడాదికి సగటున 200 రోజుల పాటు ఉపాధి లభించేలా ఈ చట్టాన్ని రూపొందించామన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం అదనంగా రూ.17 వేల కోట్లు కేటాయించిందని, అందులో తెలంగాణకు రూ.340 కోట్లు అదనంగా రానున్నాయని గణాంకాలతో వివరించారు.

పథకానికి గాంధీ పేరు తొలగించడంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రంగా ఖండించారు. గతంలో వాల్మీకి, అంబేద్కర్ పేర్లతో ఉన్న పథకాలను ఇందిరా గాంధీ పేరుతోకి మార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది అని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లను తొలగించి బీసీలకు న్యాయం చేయాలన్నదే బీజేపీ స్పష్టమైన వైఖరి అని ఆయన పేర్కొన్నారు.

Read Also: ఏఐ హెల్మెట్.. ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేస్తే అంతే!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>