కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే మూడు సంవత్సరాలలో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. మంగళవారం ఆయన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్, మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అనంతరం మంచుకొండలో ప్రాజెక్టు నీటి డెలివరీ సిస్టం వద్ద పూలతో కృష్ణ నీటికి మంత్రి ఘన స్వాగతం పలికారు. రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ఏడాది కాలంలోనే సాగు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ల సహకారంతో ఈ పనులను సకాలంలో పూర్తి చేశామని తెలిపారు. రఘునాథపాలెం మండలంలో గిరిజనులు, చిన్న, సన్న కారు రైతులు అధికంగా ఉంటారని, వీరికి కృష్ణ నీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగు నీటీ ఆకాంక్ష తీర్చామని పేర్కొన్నారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 300 వరకు లిఫ్ట్లు ఏర్పాటు చేశాం. ఎన్ఎస్పీ మీద మంచుకొండ ఎత్తిపోతల పథకం చివరి లిఫ్ట్ అని, సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంటే గోదావరి జలాలు పుష్కలంగా మనకు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అనేక ఆర్థిక ఆటంకాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని.. రైతులు లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగు వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు..


