కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ టెక్ రంగంలో భారీ పరిణామం చోటు చేసుకుంది. యాపిల్ (Apple), గూగుల్ (Google) మధ్య భారీ డీల్ కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ రెండు సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ డెవలప్ మెంట్ లో ఇక నుంచి గూగుల్ క్లౌడ్, జెమినై మోడళ్లను వినియోగించబోతోంది. దీంతో యాపిల్ ఏఐ అయిన సిరి మరింత మెరుగ్గా పనిచేయనుంది. దీనివల్ల యూజర్ల డేటా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. యూజర్ల డేటా ప్రాసెసింగ్ మొత్తం డివైజ్ లు, ప్రైవేట్ క్లౌడ్ లోనే ఉంటుందని యాపిల్ క్లారిటీ ఇచ్చింది.
ఏఐ రేసులో వెనకబడకుండా ఉండేందుకే ఈ డీల్ జరిగినట్టు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డీల్ మీద X అధినేత ఎలన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే క్రోమ్, ఆండ్రాయిడ్ తో టెక్నాలజీ రంగాన్ని గూగుల్ కంట్రోల్ చేస్తోందని.. యాపిల్ తో డీల్ వల్ల రాబోయే రోజుల్లో గూగుల్ మరింత గుత్తాధిపత్యం చెలాయిస్తుందని తెలిపారు. యాపిల్ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర సంస్థల అభివృద్ధికి అడ్డుగా మారుతున్నాయని.. ఇది ప్రపంచ టెక్ రంగానికి మంచిది కాదన్నారు ఎలన్ మస్క్.


