epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జిల్లా, మండలాల మార్పుకు బ్రేక్ !

కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు ఆశాస్త్రీయంగా ఉన్నందున రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఇప్పుడున్న జిల్లాలను రీఆర్గనైజ్ (District Reorganization) చేయాలనుకున్నారు. కానీ కేంద్రం నుంచి వచ్చిన సర్క్యులర్‌తో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకూ హద్దులు మారే అవకాశమే లేదు. కమిషన్ ఏర్పడినా అధ్యయనం వరకే పరిమితం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోడానికి వీల్లేదు. లీగల్ చిక్కుల్ని ఎదుర్కోక తప్పదు. గ్రామం మొదలు జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్ వరకు సరిహద్దులను మార్చడం, కొత్తవాటిని క్రియేట్ చేయడం, పాతవాటిని రద్దు చేయడం.. ఇలాంటి మార్పులేవీ చేయవద్దని ఆ సర్క్యులర్ స్పష్టం చేసింది.

ఏ మార్పులైనా వచ్చే ఏడాదిలోనే :

దేశవ్యప్తంగా జనాభా లెక్కల సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సెన్సస్ విభాగం రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్‌కుమార్ నారాయణన్ గతేడాది జూన్ 27న సర్క్యులర్ పంపారు. ఏ రాష్ట్రమైనా గ్రామం మొదలు జిల్లా, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వరకు హద్దులను మార్చాలనుకున్నా, భౌగోళికంగా అవసరమైన మార్పులు చేయాలనుకున్నా డిసెంబరు 31 (2025) నాటికే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేదని నొక్కిచెప్పారు. అప్పటివరకూ చేసిన మార్పులన్నింటినీ పూర్తి వివరాలతో తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు 2027 మార్చి 31 వరకు కొనసాగుతాయన్నారు.

అసెంబ్లీలో చర్చలకూ ఫుల్‌స్టాప్? :

జిల్లాల పునర్ విభజన (District Reorganization) ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం చేసిన కామెంట్‌తో కన్‌ఫ్యూజన్ నెలకొన్నది. గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనతో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయని, వీటిని సైంటిఫిక్ పద్ధతిలో స్టడీ చేసి మార్పు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అసెంబ్లీ వేదికగానే చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కానీ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ గతేడాది జారీ చేసిన సర్క్యులర్‌తో వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా సరిహద్దుల మార్పు సాధ్యం కాకపోవడంతో ఇప్పట్లో అసెంబ్లీలో చర్చించడానికీ ఇబ్బందులు వచ్చినట్లయింది. స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో దానికి భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవచ్చన్నది అధికారుల వాదన.

ఆ సర్క్యులర్‌లో రిజిస్ట్రార్ జనరల్ చెప్పిందేంటి ? :

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలనా సౌలభ్యం కోసం భౌగోళికంగా గ్రామాల మొదలు జిల్లాల వరకు సరిహద్దులను డిసెంబరు 31, 2025 లోగానే మార్చుకోవాలని, ఆ తర్వాత సాధ్యం కాదని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి ప్రక్రియ చేపట్టాలనుకుంటే 2027 మార్చి నెల తర్వాతనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలతో కొత్త జిల్లాల ఏర్పాటు, ఉనికిలో ఉన్న జిల్లాల భౌగోళిక సరిహద్దులు, జిల్లాల రద్దు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఇప్పుడున్నవాటిని మార్చడం, డీ-నోటిఫై చేయడం, గ్రామాలను విడగొట్టడం లేదా కలిపేయడం, పట్టణాలను డివైడ్ చేయడం, కొత్త టౌన్‌లను ఏర్పాటు చేయడం, ఉన్నవాటిని రద్దు చేయడం, హద్దుల్ని మార్చడం.. ఇలా మొత్తం 14 రకాల ఆంక్షలు విధించింది. ఇవి అన్ని రాష్ట్రాల్లో మార్చి 31, 2027 వరకు అమలులో ఉంటాయి.

ఈ ఆంక్షలు ఎందుకు వచ్చాయి? :

దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ జరుగుతున్నందున డిసెంబరు 31 (2025) నాటికి గ్రామం మొదలు జిల్లా వరకు భౌగోళిక సరిహద్దులు ఫ్రీజ్ చేస్తే ఆ తర్వాత మూడు నెలల పాటు ఇంటింటి సర్వే చేయడానికి అవసరమైన సిబ్బందిపై స్పష్టత వస్తుందన్నది ఈ సర్క్యులర్ ఉద్దేశం. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జనాభా వివరాల సేకరణ మొదలవుతుంది. ప్రతీ 600-700 మందికి ఒకరు చొప్పున ఎన్యూమరేటర్లు, ప్రతీ ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ చొప్పున స్టాఫ్ వర్క్ డివిజన్ జరుగుతుంది. జిల్లా మొత్తానికి కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా, అడిషనల్ కలెక్టర్ సెన్సస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

సెన్సస్ రిపోర్టుతో సంబంధం లేదు :

నిర్దిష్టంగా ఒక ఏరియాలోని గృహాలు, అందులో నివసిస్తున్న జనాభా వివరాలను సేకరించడానికి రిజిస్ట్రార్ జనరల్ పెట్టుకున్న డెడ్‌లైన్ వచ్చే ఏడాది మార్చి 31. అందువల్లనే అప్పటివరకూ భౌగోళిక సరిహద్దులు మారకుండా ఆంక్షలు వచ్చాయి. ఆ తర్వాత ఈ లెక్కలన్నింటినీ అనేక కేటగిరీల ప్రకారం విశ్లేషించి, క్రోడీకరించి రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి కనీసంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అంచనా. కానీ ఈసారి డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్ తదితరాలను వినియోగిస్తున్నందున ఫైనల్ డాటా తయరయ్యే టైమ్‌కు తగినట్లుగా నియోజకవర్గాల డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు తదితరాలపై కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సర్క్యులర్ నేపథ్యంలో 2027 మార్చి 31 వరకు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్నవాటిని రద్దు చేయడం, రీ-డిఫైన్ చేయడం, హద్దుల్ని మార్చడం.. ఇలాంటివేవీ జరిగే అవకాశమే లేదు.

Read Also: రాచకొండ పేరు మార్పు వెనక కథ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>