కలం, వెబ్ డెస్క్: తన జననం జనవరి 12.. మరణం జనవరి 12. ‘మరణం.. నా చివరి చరణం కాదు’ అంటూ ఎలుగెత్తి చాటిన అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్! (Alishetty Prabhakar) భౌతికంగా జీవించింది 39 ఏండ్లే. కానీ.. తన కవితాక్షరాలతో జనం గుండెల్లో ఆయన కలకాలం నిలిచే ఉంటారు. జగిత్యాలలో 1954లో జన్మించిన అలిశెట్టి ప్రభాకర్ .. 1993లో తనువు చాలించారు. ఆ అక్షర యోధుడి జయంతి, వర్ధంతి సందర్భంగా ఆయన కవితల్లో మచ్చుకు కొన్ని..!
సిటీ లైఫ్ గురించి..
‘‘నగరాల్లో
అత్యధికంగా
అత్యద్భుతంగా
అస్తిపంజరాల్ని
చెక్కే ఉలి.. ఆకలి!’’
వేశ్యల దుర్భర జీవితంపై..
‘‘తను శవమై…
ఒకరికి వశమై…
తనువు పుండై.. .
ఒకడికి పండై.. .
ఎప్పుడూ ఎడారై..
ఎందరికో ఒయాసిస్సై”
పాలిటిక్స్‌పై..
‘‘ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవర్నీ మోసగించనని..!
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట..
తోటి జంతువుల్ని సంహరించనని..!
ఈ కట్టుకథ విని.. గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి!!”
జనన మరణాలపై..
‘‘మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు..
నిర్విరామంగా, నిత్యనూతనంగా
కాలం అంచున చిగురించే
నెత్తుటి ఊహను నేను’’
‘బయటి’కెళ్లలేని దుస్థితిపై..
‘‘తాతా!
‘అర్జునా ఫల్గునా’ అని
తలబాదుకోకు
నిర్జన ప్రదేశమేదీ దొరకదు
మూత్ర విసర్జనకు!!’’

Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక
Follow Us On: Instagram


