కలం వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) భూ పరిశీలన ఉపగ్రహాన్ని శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ ఉపగ్రహానికి అన్వేషా(Anvesha)గా ఇస్రో నామకరణం చేసింది. సోమవారం ఉదయం సరిగ్గా 10 గంటల 17 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం పీఎస్ఎల్వీ సీ-62(PSLV-C62) ద్వారా నిర్వహించారు. ఇది పీఎస్ఎల్వీకి 64వ ప్రయోగం కావడం విశేషం. భారత్‌లో అత్యంత నమ్మకమైన, విజయవంతమైన రాకెట్‌గా పీఎస్ఎల్వీ గుర్తింపు పొందింది.
ప్రధాన ఉపగ్రహం అన్వేషాకు తోడుగా, ఈ రాకెట్ ద్వారా భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో 15 ఉపగ్రహాలను కూడా పంపించారు. దేశ రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ ప్రయోగం నిర్వహించారు. డీఆర్డీవో రూపొందించిన అన్వేషా ఉపగ్రహం అత్యాధునిక ఇమేజింగ్ సామర్థ్యంతో శత్రు స్థితులను ఖచ్చితంగా గుర్తించగలదు. దీని బరువు 1,485 కేజీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగంలో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం భాగస్వామ్యం కావడం మరో విశేషం. హైదరాబాద్‌లోని ధ్రువ స్పేస్ సంస్థ ఈ ప్రయోగంలో ఏడు ఉపగ్రహాలను అందించింది. ఇది భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు గొప్ప అవకాశాలకు మార్గాన్ని సుగమమం చేసింది.


