కలం, వెబ్ డెస్క్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా (Team India) బోణీ కొట్టింది. హోరాహోరీగా సాగిన తొలి వన్డేలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 301 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. బ్యాటర్ల సమిష్టి కృషితో పర్యాటక జట్టుపై భారత్ పైచేయి సాధించి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఓపెనర్లు హెన్రీ నికోల్స్ 62, డెవాన్ కాన్వే 56 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టి కివీస్ పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు.
అనంతరం 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ, విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో స్టేడియాన్ని హోరెత్తించారు. కోహ్లీ 93 పరుగులతో సెంచరీ చేజార్చుకున్నా జట్టును విజయానికి చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అతనికి తోడుగా శుభ్‌మన్ గిల్ 56 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 49 పరుగులతో రాణించడంతో భారత్ గెలుపు దిశగా సాగింది.
చివరి ఓవర్లలో కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ వరుస వికెట్లు తీసి ఉత్కంఠ రేపినప్పటికీ, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సంయమనంతో ఆడారు. ముఖ్యంగా హర్షిత్ రాణా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే టీమ్ ఇండియా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ (Team India) 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రక్షించిన రాహుల్..
చివరికి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. విన్నింగ్ షాట్ 6తో మ్యాచ్‌ను ముగించారు. వరుస వికెట్లు పడుతూ ఒత్తిడి పెరుగుతున్నా రాహుల్.. కూల్‌గా ఆడి జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. ఆఖరిలో వాషింగ్‌టన్ సుందర్‌తో కలిసి నిలకడగా వికెట్లను కాపాడుకుంటూ స్కోర్‌ను ముందుకు నడిపించాడు. 11 బంతులకు 11 పరుగులు చేయాలన్నప్పటి నుంచి రాహుల్ తన స్టైల్ మార్చేశాడు. ఆఖరిలో సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. గెలిచే మ్యాచ్‌ను కివీస్ చేతిలో పెట్టారన్న పరిస్థితి నుంచి చిన్నగా తేరుకున్న భారత్.. ఎట్టకేలకు ఘన విజయం సాధించింది.


