కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారత రాజ్యాంగ గొప్పతనాన్ని వివరిస్తూనే, భవిష్యత్తుపై తన ఆకాంక్షను ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ భారత్, పాకిస్తాన్ రాజ్యాంగాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం కేవలం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు మాత్రమే ఆ దేశ ప్రధాని కాగలరని, కానీ భారత రాజ్యాంగం అలా కాదని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని ఒవైసీ (Owaisi) కొనియాడారు. కుల, మత వివక్ష లేకుండా భారత పౌరులెవరైనా దేశ ప్రధానిగా, ముఖ్యమంత్రిగా లేదా మేయర్‌గా ఎదిగే అవకాశం మన రాజ్యాంగం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘ఒక రోజు హిజాబ్ ధరించిన మన కుమార్తె ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది. అది నా కల. ఆ రోజు తప్పకుండా వస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరం ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో ఇది నిజమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఒవైసీ (Owaisi) వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ, రాజ్యాంగ పరంగా ఎవరైనా ప్రధాని కావచ్చనేది నిజమేనని, అయితే భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశమని, ఇక్కడ ఎప్పుడూ హిందువులే ప్రధాని అవుతారని తాను నమ్ముతున్నానని అన్నారు. అటు మహారాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఒవైసీ వ్యాఖ్యలను తప్పుబడుతూ, ఆయన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.


