epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: డిప్యూటీ సీఎం

కలం, వరంగల్ బ్యూరో : సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఇది తెలంగాణ రాష్ట్ర గుండె చప్పుడు, ఆత్మగౌరవ ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం మేడారంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

251 కోట్లతో ఘనంగా ఏర్పాట్లు

ఈ ఏడాది మేడారం జాతర (Medaram Jatara) నిర్వహణ కోసం ప్రభుత్వం 251 కోట్ల రూపాయలను కేటాయించిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. గతంలో 75 నుండి 100 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, కానీ తమ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు. ఇందులో 150 కోట్లు జాతర నిర్వహణకు, 101 కోట్లు శాశ్వత గుడి నిర్మాణ పనులకు వెచ్చిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను జనవరి 15లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మాస్టర్ ప్లాన్‌తో పెరగనున్న దర్శన సామర్థ్యం

జిల్లా కలెక్టర్ దివాకర జాతర మాస్టర్ ప్లాన్ వివరాలను మంత్రులకు వివరించారు. దేవాలయ కోర్ ఏరియాను 32 వేల చదరపు అడుగుల నుండి 54 వేలకు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల గతంలో ఒకేసారి 3 వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునే వీలుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 8 వేలకు పెరిగిందని చెప్పారు. గద్దెల ప్రాకారం వద్ద 8 గేట్లను నిర్మిస్తూ, ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా శిల్పాలను చెక్కించినట్లు పేర్కొన్నారు.

భక్తుల భద్రత, సౌకర్యాలు

మేడారం జాతర (Medaram Jatara)లో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఐటీ శాఖ సహకారంతో క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీని వాడుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3,600 బస్సులను నడుపుతూ దాదాపు 20 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య శాఖ తరపున 50 పడకల ఆసుపత్రి, 30 హెల్త్ క్యాంపులు, 30 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. భద్రత కోసం 13 వేల మంది పోలీసులు, 480 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.

మేడారంలోనే కేబినెట్ సమావేశం

ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారని, ఆ సందర్భంలోనే అక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మహాజాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్‌ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్‌ టీఎస్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేశ్​, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>