epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బిట్ కాయిన్ పేరుతో కోట్లు కొట్టేశారు..!

కలం, వరంగల్ బ్యూరో, జనగామ : జనగామ జిల్లాలో భూభారతి స్కామ్ పై పోలీసుల విచారణ కొనసాగుతుండగానే మరో మోసం వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లాలో బిట్ కాయిన్ (ఫేక్ క్రిప్టో కరెన్సీ) పేరుతో భారీ మోసానికి తెర తీశారు కొందరు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ప్రముఖులకు ఆశ చూపి మోసం చేసారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఒక క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ దీని నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది నమ్మి డబ్బులు అందజేశారు. ఈ క్రిప్టో కరెన్సీకి (Crypto currency) సంబంధించి మూడు నెలలకోసారి పేర్లు మారుస్తూ వచ్చారు. ఇందులో వన్ స్టార్ నుంచి 7 స్టార్ వరకు రేటింగ్‌ ఉంటుందని.. రూ.10వేల పెట్టుబడి పెట్టిన మరుసటి రోజు నుంచి రోజుకు రూ.50 చొప్పున 400 రోజుల వరకు మొత్తం రూ.20 వేలు అందజేస్తామని సదరు నిర్వాహకులు చెప్పారు.

ఇలా రూ.10 వేల నుంచి స్టార్స్‌ కేటగిరీ వారీగా రూ. కోటి వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని నమ్మించారు. కోటి పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదిలో కోటిన్నరకు పైగా లాభంతో పాటు విదేశీ ట్రిప్పులు, గిఫ్టులు, కార్ల పేరిట ఆశ చూపించారు. 9 నెలల పాటు పెట్టుబడులు పెట్టిన వారికి క్రమం తప్పకుండా రిటర్న్స్ ఇచ్చేశారు. దీంతో ఈ బిట్ కాయిన్ల దందా గురించి ఎక్కువ మందికి తెలిసి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఇందులో సంపన్నులు, ప్రముఖ వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్లర్లు కూడా పెట్టుబడి పెట్టారు. కోట్లలో పెట్టుబడులు రావడంతో నిర్వాహకులు రూటు మార్చేశారు. వాలెట్ నుంచి డబ్బులు రికవరీ చేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. పెట్టుబడిదారులు 2025 జులైలో ప్రశ్నించడంతో.. వేరే వాలెట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని నిర్వాహకులు చెప్పారు. జూలై నెలలో వేరే వాలెట్ కు డబ్బులు షిఫ్టింగ్‌ చేసుకున్న వారికి 180 రోజుల తర్వాత డిసెంబర్‌లో క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ గత డిసెంబర్ లో క్లెయిమ్ చేసుకుందామని వాలెట్ ను క్లిక్ చేస్తే డబ్బులు జీరోగా చూపిస్తుండటంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.

వేలల్లో బాధితులు..

ఈ క్రిప్టో కరెన్సీలో ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండటంతో.. ఈ విషయం బయటకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జననగామ జిల్లాతో పాటు నిర్మల్, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, జగిత్యాల, కరీంనగర్, వరంగల్‌ తదితర జిల్లాల్లో ఇలాంటి దందా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జనగామ జిల్లాలోనే 1000 నుంచి 1500 వరకు మందికి పైగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో జిల్లాకు చెందిన ఓ బాధితుడు యాదాద్రి జిల్లా గుండాల మండల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పెట్టుబడి పెట్టించిన వ్యక్తిపై ఈ నెల 6న ఐటీ యాక్టు, చీటింగ్‌ కేసు నమోదైనట్లు తెలిసింది. పెట్టుబడి పెట్టించిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. లక్షలు, కోట్లలో మోసపోయిన బాధితుల్లో చాలా మంది బయటకు రావట్లేదు. స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులను ఆశ్రయిస్తూ జరిగిన మోసాన్ని వివరించి, డబ్బులు ఎలాగైనా రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: ‘అయ్యప్ప’ అస్త్రంగా కేరళపై షా గురి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>