కలం డెస్క్: సంక్రాంతి (Sankranti) వస్తే చాలు పట్నం ఖాళీ అవుతుంది. జనం పల్లెబాట పడ్తుంటారు. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ అవుతున్నది. ఆదివారం మధ్యాహ్నం భాగ్యనగరంలోని ఫ్లై ఓవర్లు, రోడ్లపై ఏ మాత్రం రద్దీ లేదు. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తయారైంది. అయితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే పంతంగి టోల్ ప్లాజా (Panthangi Toll Plaza) దగ్గర మాత్రం ఫుల్ రష్. వరుసగా సెలవులు రావడంతో సిటీ ప్రజలు శుక్రవారం నుంచే ఊర్ల బాట పట్టారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను ఆంధ్రాలోని తమ పల్లెల్లో జరుపుకొనేందుకు హైదరాబాద్ నుంచి జనం సొంత వెహికల్స్ లో బయలుదేరారు.
కేవలం 16 గంటల వ్యవధిలోనే పంతంగి టోల్ ప్లాజా మీదుగా 50 వేలకుపైగా వెహికల్స్ విజయవాడ వైపు వెళ్లాయి. అంటే గంటకు దాదాపు 3వేలకుపైగా వాహనాలు అటుగా కదిలాయి. ఇవన్నీ కార్లు, బస్సులు వంటి ఫోర్ వీలర్స్ కు సంబంధించిన లెక్క!! ఇక, ఇతర రూట్లలో ఊర్ల మీదుగా వెళ్లిన బండ్లకు లెక్కే లేదు.
సాధారణ రోజుల్లో అంతంత మాత్రమే!
హైదరాబాద్ నుంచి విజయవాడకు దూరం 278 కిలో మీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి అటుగా వెళ్లాలంటే ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని పంతంగి టోల్ ప్లాజాను దాటాల్సిందే. సాధారణ రోజుల్లో ఈ రూట్ లో రోజుకు అంటే 24 గంటల్లో రెండు వైపులా రాకపోకలు సాగించే వెహికల్స్ సంఖ్య 40 వేలు మాత్రమే. పండుగ సీజన్లలో.. అదీ సంక్రాంతి వంటి వేడుకైతే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు అంటే మొత్తం 8 గంటల్లో పంతంగి మీదుగా హైదరాబాద్ నుంచి వెళ్లిన వాహనాలు 21వేలకు పైనే! శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంటే మరో 6 గంటల్లో వెళ్లిన వెహికల్స్ సంఖ్య 22వేలకుపైనే!
ఆ తర్వాత ఆదివారం ఉదయం వరకు వెళ్లిన వెహికల్స్ దాదాపు 30 వేల వరకు ఉంటాయని అంచనా!! సాధారణ రో జుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు గంటకు 200 కూడా దాటవు. కానీ.. సంక్రాంతి కావడంతో 3వేలకు పైగా వెళ్లాయి. సంక్రాంతి ముగిసిన 16వ తేదీ నుంచి కూడా ఇదే స్థాయిలో రిటర్న్ జర్నీలు ఉంటాయి.
ప్రతి ఇద్దరిలో ఒకరికి సొంత వెహికల్!
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ అంతకంతకూ వాహనాలు పెరిగిపోతున్నాయి. జనం పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కంటే.. సొంత వాహనాలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దాదాపు ప్రతి ఇంట్లో టూ వీలర్ కంపల్సరీగా ఉంటున్నది. కార్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్న మిడిల్ క్లాస్ ప్రజలు కూడా చిన్నపాటి కారును కొనుగోలుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటిన్నర వరకు ఉంటే.. వ్యక్తిగత వాహనాలు 90 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో టూ విలర్స్ , కార్ల సంఖ్యే ఎక్కువ. సగటున దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి సొంత వెహికల్ ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
ఇక, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు వెహికల్స్ వేరే! ఇట్లా జనం తమ సొంత వాహనాల్లోనే ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఫలితంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. సంక్రాంతి లాంటి పండుగ సీజన్లలో టోల్ ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా విలీనం కావడం.. నగర పరిధి విస్తరించడంతో జనాభా కూడా పెరుగుతుందని, అదే స్థాయిలో వ్యక్తిగత వాహనాలు సైతం పెరుగుతాయని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: సత్తుపల్లిలో భారీ సైబర్ దోపిడీ.. 18 మంది నిందితుల అరెస్ట్
Follow Us On : WhatsApp


