కలం వెబ్ డెస్క్ : నటి సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంతో సమంత మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో ఆమె పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఒక వైపు ప్రశాంతంగా, ఆదర్శవంతమైన కోడలిగా కనిపించే పాత్ర… మరోవైపు యాక్షన్ సీక్వెన్సులతో ఉత్కంఠను రేపే శక్తివంతమైన క్యారెక్టర్లో సమంత కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘బాపు బొమ్మ సిరీస్’ (Bapu Bomma Series) పేరుతో కొన్ని ప్రత్యేక లుక్స్ విడుదల చేశారు. యాక్షన్‌కు భిన్నంగా సున్నితంగా కనిపించే ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఐవరీ రంగు లినెన్ చీరలో సమంత బ్యూటిఫుల్‌గా కనిపించారు. ప్రముఖ డిజైనర్ లేబుల్ అనవిలా (Anavila) నుంచి వచ్చిన ఈ చీరకు గోటా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఫ్రెంచ్ లేస్ ఎడ్జింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చీరకు ఆమె పాత గులాబీ రంగు శాటిన్ బ్లౌజ్‌ను జత చేశారు. షార్ట్ స్లీవ్స్‌తో డీప్ నెక్ డిజైన్ ఈ లుక్కు మరింత గ్రేస్‌ను తీసుకొచ్చింది. సమంత ధరించిన ముత్యాల చోకర్, చిన్న డ్రాప్స్‌తో ఉన్న కంబళీలు, బంగారు గాజులు చూపరులను ఆకట్టుకున్నాయి. మేకప్, హెయిర్ స్టైల్ కూడా ఆమెను మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. మొత్తంగా ‘బాపు బొమ్మ’ సిరీస్‌లో సమంత సంప్రదాయ సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచారు. ఈ లుక్‌ను సమంత స్వయంగా ప్రముఖ తెలుగు కళాకారుడు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ)కు అంకితం చేశారు. “సున్నితత్వాన్ని శక్తిగా మలిచిన, సరళతను చిరస్మరణీయంగా మార్చిన కళాకారుడికి నివాళి” అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

Read Also: సినిమా కలలపై దాడులు.. విజయ్ దేవరకొండ భావోద్వేగం
Follow Us On: Sharechat


