కలం, వెబ్ డెస్క్: త్వరలో జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ (Janasena) ప్రకటించడం రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఆ పార్టీ ఇకపై తెలంగాణలోనూ సంస్థాగతంగా బలోపేతం అవుతామని, ఇందుకోసం మున్సి‘పోల్స్’ బరిలో నిలుస్తామని చెప్పింది. ఎన్నికలకు తక్కువ టైమ్ ఉండటంతో వీలైనన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపింది. జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan).. తెలంగాణ రాజకీయాల వైపు చూడటంతో సహజంగానే ఇక్కడి ఆయన అభిమానులకు సంక్రాంతికి ఐదురోజుల ముందే పండుగ వచ్చినట్లయింది. నాయకుడిగా కన్నా టాలీవుడ్ స్టార్ గా తెలంగాణలో పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అది ఇప్పుడు జనసేనకు ఓటు బ్యాంకుగా మారుతుందా? మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో ఆ పార్టీ నేతలు పోటీ చేస్తారు? మిగతా చోట ఎవరికి మద్దతిస్తారు? పవన్ పార్టీ పోటీతో ఇతర పార్టీలపై ప్రభావం ఏ మేరకుంటుంది? ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం? ఇప్పుడు ఇదో చర్చనీయాంశం.
ఏపీలో బీజేపీతో దోస్తీ.. తెలంగాణ విడిగా పోటీ :
అటు ఏపీతోపాటు కేంద్రంలోనూ బీజేపీతో కలిసి జనసేన పార్టీ పనిచేస్తున్నది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ (BJP)తో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసింది. దాదాపు ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. పవన్ కల్యాణ్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని చోట్ల జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆ పార్టీ శనివారం ప్రకటించింది.
117 మున్సిపాలిటీలకు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల కు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. వీటిలో ఏయే స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నది? తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేసి.. మిగతా స్థానాల్లో బీజేపీకి మద్దతివ్వనుందా? అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఏపీలో కూటమిలో ఉన్నందున తెలంగాణలో కూడా బీజేపీకి ఆ పార్టీ సపోర్ట్ చేయవచ్చని కమలం కేడర్ ఆశిస్తున్నది. జనసేనాని మద్దతిస్తే బీజేపీకి కలిసి వస్తుందని.. పట్టణాల్లో ఇప్పటికే కమలానికి పట్టు ఉన్నదని, అది పవన్ సపోర్ట్ తో మరింత రెట్టింపవుతుందని బీజేపీ కేడర్ అంచనా వేసుకుంటున్నది.
కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకేనా?!
మొదటి నుంచి కాంగ్రెస్ అంటేనే పవన్ కల్యాణ్ నిప్పులు చెరుగుతుంటారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉంది. ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లోనైనా చెక్ పెట్టేందుకే జనసేనను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు మూడేండ్లకు పైగా టైమ్ ఉండటంతో ఇంతలోపు రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసుకొని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే స్థానాల్లోనూ పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే.. పవన్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తే అది తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటున్నది.
తెలంగాణ విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టడంతోపాటు తెలంగాణపై పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన కామెంట్లను జనంలోకి తీసుకెళ్లొచ్చని.. దీంతో బీజేపీకి కూడా చెక్ పెట్టినట్లవుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఆ మధ్య ‘‘తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి” అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. వీటిని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు. మొదటి నుంచి మోదీకి, పవన్ కల్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే గిట్టడం లేదని.. వీలు దొర్కినప్పుడల్లా మాటలతో విషం గక్కుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Read Also: సమాజంలో నాదీ డాక్టర్ లాంటి పాత్రే.. సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


