కలం, వెబ్ డెస్క్ : తాను వృత్తిరీత్యా వైద్యుడిని కాకపోయినప్పటికీ, ముఖ్యమంత్రిగా సమాజ రుగ్మతలను పరిష్కరించడంలో తనది ఒక డాక్టర్ లాంటి పాత్రేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ (HICC)లో ఏర్పాటు చేసిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుండి వచ్చిన 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులకు ఆయన ఘన స్వాగతం పలికారు.
నిరంతరం నేర్చుకోవడమే అసలైన విజయ రహస్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంతటి విజయవంతమైన వైద్యులైనా తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపివేస్తే కెరీర్ కు ముగింపు పలికినట్లేనని ఆయన హెచ్చరించారు. వైద్యులు ప్రాణాలు కాపాడే దేవుళ్లని సమాజం బలంగా నమ్ముతుందని, అందుకే మనుషుల పట్ల, సమాజం పట్ల తమకున్న బాధ్యతను ఎన్నడూ మరువకూడదని ఆయన కోరారు.
హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలలో అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో వైద్య రంగం పెనవేసుకుపోయిందని, వైద్యులు ఈ సాంకేతికతపై పట్టు సాధించడంతో పాటు ప్రజల నాడిని పట్టుకోవడం కూడా ముఖ్యమని సూచించారు.
ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ ఒక మిషన్ లా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు సీపీఆర్ (CPR) వంటి ప్రాణరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఆరోగ్య సంరక్షణలో నాణ్యత పెంచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజల ప్రయోజనాల కోసం పాలసీలను మెరుగుపరిచే క్రమంలో వైద్యుల సలహాలు, సూచనలను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read Also: పోక్సోలోకి రోమియో-జూలియట్ క్లాజ్.. సుప్రీంకోర్టు కీలక సూచన!
Follow Us On: X(Twitter)


