కలం, వెబ్ డెస్క్ : నందిగామ సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Suresh Babu) స్వయంగా క్రమబద్ధీకరించారు. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో వాహనాల రాకపోకలు పెరగడం, మరోవైపు రోడ్డు మరమ్మతులు కొనసాగుతుండటంతో అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అటుగా ప్రయాణిస్తున్న సురేష్ బాబు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించి తన కారు దిగి స్వయంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పూనుకున్నారు.
రోడ్ల పరిస్థితి, అధికారుల తీరుపై ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సీజన్‌లో ఐదు రోజుల పాటు హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుందని ముందే తెలుసని, అటువంటప్పుడు అధికారులు వీలైనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్ అండ్ బీ శాఖ రోడ్డు మరమ్మతుల విషయంలో మరింత వేగంగా స్పందించాలని కోరారు.
తమ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ, ఉదయం 6:30 గంటలకు బయలుదేరినప్పటికీ విజయవాడ చేరుకోవడానికి 6 గంటలకు పైగా సమయం పట్టిందని సురేష్ బాబు (Suresh Babu) పేర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పండుగ వేళ ఇటువంటి సమస్యలు తలెత్తకుండా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read Also: సమాజంలో నాదీ డాక్టర్ లాంటి పాత్రే.. సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


