కలం వెబ్ డెస్క్: సినిమా సెన్సార్ (Film Censorship) ప్రక్రియపై పారదర్శకత (Transparency) అవసరమని, కళా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇది కేవలం ఒక సినిమా సమస్య కాదని, దేశంలో కళాకారులకు, కళకు ఇచ్చే స్వేచ్ఛకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగం (Indian Constitution) భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇస్తుందని గుర్తు చేసిన కమల్ హాసన్.. ఆ స్వేచ్ఛ స్పష్టతతో, న్యాయబద్ధంగా అమలవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అస్పష్టత ఉంటే సృజనాత్మకత దెబ్బతింటుందని, దాని ప్రభావం మొత్తం సినీ పరిశ్రమపై పడుతుందని చెప్పారు. సినిమా అనేది ఒక్క వ్యక్తి కృషి కాదని, రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, థియేటర్ల యజమానులు, చిన్న వ్యాపారులు ఇలా ఎంతోమంది జీవనాధారం దీనిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. సెన్సార్ ప్రక్రియలో ఆలస్యం, స్పష్టత లేకపోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు.
తమిళనాడు సహా దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు కళను అర్థం చేసుకునే పరిపక్వత కలిగినవారని, వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ విధానంపై మళ్లీ ఒకసారి సమగ్రంగా పునఃపరిశీలన జరగాలని కమల్ హాసన్ (Kamal Haasan) డిమాండ్ చేశారు. సర్టిఫికేషన్‌కు స్పష్టమైన గడువు, పారదర్శక పరిశీలన విధానం, ఎలాంటి కత్తిరింపులు సూచించినా వాటికి రాతపూర్వకంగా సరైన కారణాలు చెప్పాలని సూచించారు. ఇది మొత్తం సినీ పరిశ్రమ ఒక్కటిగా నిలబడి ప్రభుత్వ సంస్థలతో సానుకూలంగా చర్చించాల్సిన సమయమని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే కళా స్వేచ్ఛకు భద్రత లభిస్తుందని, రాజ్యాంగ విలువలు కాపాడబడతాయని, ప్రజలపై, కళాకారులపై విశ్వాసం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.
Read Also: టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వానికే క్లారిటీ లేదా?
Follow Us On: X(Twitter)


