కలం వెబ్ డెస్క్ : నేపాల్(Nepal) సరిహద్దు మార్గం నుంచి వీసా(Visa), పాస్‌పోర్ట్ లేకుండా భారత్(India)లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళ(Chinese woman)ను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మహారాజ్‌గంజ్ జిల్లా నౌటన్వా ప్రాంతంలో జరిగింది. బైరియా బజార్ వద్ద ఉన్న నడక మార్గం ద్వారా చైనా మహిళ భారత్‌లోకి వస్తుండగా భద్రతా సిబ్బంది గమనించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమెను ఆపి పరిశీలించగా, ఆమె వద్ద ఎలాంటి వీసా లేదా పాస్‌పోర్ట్ పత్రాలు లేవని తేలింది. దీంతో అక్కడే ఉన్న సశస్త్ర సీమా బల్ (SSB) సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని, అనంతరం నౌటన్వా పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను అధికారికంగా అరెస్ట్ చేశారు. నౌటన్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురుషోత్తం రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె వద్ద లభించిన ఒక స్లిప్ ఆధారంగా ఆమెను చైనాకు చెందిన హువాజియా జీగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె ఏ నగరానికి చెందినది, భారత్‌కు రావడానికి గల కారణం ఏమిటన్న విషయాలపై విచారణ కొనసాగుతోంది. భాష సమస్య కారణంగా ఆమె నుంచి ఇప్పటి వరకు పూర్తి సమాచారం రాబట్టలేకపోయామని పోలీసులు తెలిపారు.


