కలం, వెబ్ డెస్క్: రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగానే చాలామంది వింటర్ సీజన్‌లో సాక్సులు (Socks) ధరించి నిద్రపోతుంటారు. ఇది మంచిదేనా? అని సందేహాలున్నాయి. చలి రక్షణకు రాత్రిపూట సాక్స్ ధరించవచ్చు. ఇది పాదాలను వెచ్చగా ఉంచుతుంది. పదే పదే మేల్కొనకుండా నిరోధిస్తుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. వెచ్చని పాదాలు త్వరగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అంటే పడుకునేటప్పుడు సాక్స్ ధరిస్తే, త్వరగా నిద్రపోతారు.
దీని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. పాదాలు వెచ్చగా ఉండటం వల్ల రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. ఈ ప్రక్రియను వాసోడైలేషన్ అంటారు. ఇది శరీరాన్ని రిలాక్స్డ్ మోడ్‌లోకి తీసుకువెళుతుంది. నిద్ర (Sleep)ను ప్రేరేపిస్తుంది. మరోవైపు, పాదాలు చల్లగా ఉన్నప్పుడు రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఇది విశ్రాంతి, నిద్ర కోసం సరైన సంకేతాలను అందుకోకుండా చేస్తుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ మరికొన్ని పరిశోధనల ప్రకారం.. సాక్స్ ధరించడం వల్ల కొంతమంది త్వరగా నిద్రపోతారట. నిజానికి, వెచ్చని పాదాలు మెదడుకు విశ్రాంతి, నిద్ర సంకేతాన్ని పంపుతాయి.


