కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్లబయ్యారంలో జరుగుతున్న 69వ జాతీయ బాలుర కబడ్డీ పోటీల్లో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. శుక్రవారం ఈ పోటీలకు హాజరైన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti), తన అధికార హోదాను పక్కనపెట్టి స్వయంగా క్రీడాకారుడిలా మారి మైదానంలోకి దిగారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఒక జట్టులో ఉండగా, మంత్రి పొంగులేటి (Minister Ponguleti) మరో జట్టు తరపున ఉత్సాహంగా తలపడ్డారు. మంత్రి స్వయంగా కూతకు వెళ్లడం, క్రీడాకారులతో కలిసి ఆట ఆడటం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. కేవలం అతిథిలా వచ్చి వెళ్లడమే కాకుండా, క్రీడాకారులతో సరదాగా ముచ్చటిస్తూ వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. రాజకీయ రంగంలోనే కాకుండా క్రీడా రంగంలోనూ తనదైన శైలిలో క్రీడాస్ఫూర్తిని చాటుకున్న మంత్రిని చూసి క్రీడాకారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


