కలం, వెబ్‌డెస్క్: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించినప్పటి నుంచి అమెరికా దూకుడు కొనసాగిస్తోంది. మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు పరోక్ష సహకారం.. ఇలా రకరకాల సాకులు చెబుతూ తన దుందుడుకు చర్యలు కొనసాగిస్తోంది. ఒకవైపు రష్యా అనుకూల దేశాల మీద ఆంక్షలు విధిస్తూనే మరోవైపు అట్లాంటిక్ సముద్రంలో వెనెజువెలా నుంచి వెళుతున్న వివిధ దేశాల ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా ఇప్పటివరకు నాలుగు ఆయిల్ ట్యాంకర్లను తమ ఆధీనంలోకి తీసుకున్న అగ్రరాజ్యం.. శుక్రవారం ఐదో ట్యాంకర్ (US seizes fifth oil tanker) ను బంధించింది.
అట్లాంటిక్ సముద్రమంతా నిఘా పెట్టిన అమెరికా నేవీ దళాలు.. కరేబియన్ దీవుల వద్ద ‘ఒలీనా’ అనే చమురు నౌక (US seizes fifth oil tanker) ను అదుపులోకి తీసుకుంది. వెనెజువెలా నుంచి ఆయిల్ ట్యాంకర్లతో బయలుదేరిన ఈ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా నేవీ ప్రకటించింది. ఈ చమురు నౌకపై హెలికాప్టర్ల సాయంతో తమ బలగాలు దిగి, సోదా చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఆ నౌకలో ఏమేమి స్వాధీనం చేసుకుందో వివరాలు వెల్లడించలేదు. కాగా, రెండురోజుల కిందట రష్యా చమురు నౌకను ఇలాగే అమెరికా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రష్యా తీవ్రంగా మండిపడింది. ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు, యూఎస్ స్వాధీనం చేసుకున్న రష్యా నౌకలో 28 మంది సిబ్బంది ఉండగా, అందులో ముగ్గురు భారతీయులని గుర్తించారు.


