కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లు (Bhatti Vikramarka) గుడ్ న్యూస్ తెలిపారు. ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం కుటుంబ సభ్యులుగా భావిస్తోందన్నారు. ఈ ప్రమాద బీమా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయిలను దశలవారీగా విడుదల చేస్తున్నామని వివరించారు.
‘సింగరేణి, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే కోటికి పైగా ప్రమాద బీమాను అందిస్తున్నాం. సింగరేణిలో పనిచేస్తున్న 38 వేల మంది ఉద్యోగులకు, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71వేల 387 మందికి ఈ బీమా వర్తిస్తోంది. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకువస్తాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) వివరించారు.


