కలం, ఖమ్మం బ్యూరో: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ (Seetharama Lift Irrigation Project) ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణ నదుల నుంచి రావలసిన ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటామని ఆయన అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వరావుపేట మండలం గండుగులపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగవ పంప్ హౌస్ పనుల పురోగతిని, అలాగే మొత్తం ప్రాజెక్టు పనుల స్థితిగతులపై భారీ నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక వివరాలను మంత్రులకు వివరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించామని తెలిపారు. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 968 టీఎంసీల (TMC) నీటి వాటా కేటాయించబడిందని, నీటి లభ్యత 75 శాతం దాటిన తర్వాత సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని తెలిపారు. తాగునీటి అవసరాలను కూడా ప్రత్యేకంగా లెక్కగట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయ్యే అవకాశమున్న సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.19,324 కోట్ల వ్యయంతో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించనున్నట్లు తెలిపారు.


