కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలో పార్టీ శ్రేణులు చురుగ్గా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కీలక నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలను సరిగ్గా చెప్పుకుంటే మరో పార్టీకి భవిష్యత్తు ఉండేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు పనిచేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రతిరోజూ కనీసం పది మందికి వివరించాలని కోరారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ హయాంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆధునిక విద్యుత్ వ్యవస్థ, విద్యా సంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ మరియు పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చాయని గుర్తు చేశారు.
పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల వల్ల ఎదురవుతున్న తాత్కాలిక ఇబ్బందులను ఆయన ఒక ఉదాహరణతో వివరించారు. ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు, ఇసుకతో అస్తవ్యస్తంగా కనిపించినా, నిర్మాణం పూర్తయ్యాక ఇల్లు ఎంత అందంగా ఉంటుందో, డ్రైనేజీ పనులు పూర్తయ్యాక మధిర నగరం అంత సుందరంగా మారుతుందని భరోసా ఇచ్చారు. పనులు పూర్తయిన చోట వెంటనే మట్టిని పూడ్చాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ పనుల అనంతరం నగరం మొత్తం కొత్త సిసి రోడ్ల నిర్మాణం చేపడతామని, మధిరను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశారు.


