కలం డెస్క్: సివిల్ సర్వెంట్లయిన ఐఏఎస్ లు (IAS), ఐపీఎస్ లు (IPS), ఐఎఫ్ఎస్ లు (IFS) తాము పనిచేస్తున్న రాష్ట్రాల్లోని లోకల్ లాంగ్వేజ్ మస్టుగా నేర్చుకోవాల్సిందేనా?! లేకపోతే ఎదురయ్యే సమస్యలు ఏమిటి?! మన రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లలో ఎంత మందికి తెలుగు (Telugu) వచ్చు? ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొత్త ఐఎఫ్ఎస్ అధికారులు తప్పనిసరిగా తెలుగు నోర్చుకోవాల్సిందేనని చెప్పడంతో ఇది చర్చకు దారితీసింది.
రాకపోతే.. తిప్పలు
సివిల్ సర్వెంట్లు దేశవ్యాప్తంగా తమకు కేటాయించిన రాష్ట్రాల్లో పనులు చేయాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని నడిపేది వాళ్లే కాబట్టి.. నిరంతరం జనంతో మమేకమవుతుంటారు. ప్రజలు కూడా నేరుగా వాళ్ల దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటుంటారు. అలాంటి సివిల్ సర్వెంట్లకు కమ్యూనికేషన్ గా స్థానిక భాష వచ్చి ఉండాలి. లేకపోతే.. జనం మాట్లాడేది ఏమిటో అర్థంకాక, జనం సమస్యలు తెలియక పాలన గాడి తప్పుతుంది. ప్రజలతో సాన్నిహిత్యం పెరగాలంటే, వారి తిప్పలు తెలియాలంటే స్థానిక భాష (local language) తప్పనిసరిగా నేర్చుకొని ఉండాలి.
సీఎంవోని కొందరు సెక్రటరీలదీ అదే పరిస్థితి!
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లోని కొందరు సెక్రటరీలకు కూడా స్థానిక భాష రాదన్న వాదనలు ఉన్నాయి. సీఎంవో లో ఫైళ్లు పెండింగ్ పడటానికి అధికారుల మధ్య సమన్వయలోపం ఒక కారణమైతే.. స్థానిక పరిస్థితులపై వారికి అవగాహన లేకపోవడం మరో కారణమని తెలుస్తున్నది. స్థానిక పరిస్థితులపై అవగాహన రావాలంటే ముందుగా వారికి స్థానిక భాష తెలుసుండాలని.. అదే సమస్యగా మారుతున్నదని సెక్రటేరియెట్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలోని సివిల్ సర్వెంట్లలో చాలా మందికి లోకల్ లాంగ్వేజ్ రాదని.. కొందరికైతే అర్థం కూడా కాదన్న విమర్శలు ఉన్నాయి. మాట్లాడటానికి రాకపోయినా.. అర్థం కాకపోతే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమిళనాడులో మస్ట్!
తమిళనాడు పాలకులకైనా, ప్రజలకైనా భాషాభిమానం మెండు. అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాల్లో తప్పనిసరిగా తమిళ్ ను అమలు చేస్తుంటారు. కరుణానిధి మొదలు జయలలిత, ఇప్పుడు స్టాలిన్ వరకు అందరూ తమిళ్ భాషకు ప్రాధాన్యం ఇచ్చేవారే. తమ రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ ఎస్ అయినా తప్పనిసరిగా తమిళ్ నేర్చుకోవాల్సిందేనని.. ఇందుకోసం మూడు నాలుగు నెలలు ప్రజల్లో తిరగాలని, జనంలో ఉండి భాష మీద ముందు పట్టు సాధించాలన్న రూల్ను అమలు చేస్తున్నారు. ఫైళ్ల పై సంతకాలు సహా అన్నీ తమిళ్ లోనే ఉండాలని అప్పట్లో కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు నిబంధనను కఠినతరం చేశారు. తమిళ్ ఎట్ ఆల్ లెవల్స్ (Tamil at all levels) అనే విధానాన్ని ప్రోత్సహించారు. తమిళనాడులోని చాలా మంది సీనియర్ సివిల్ సర్వెంట్లు తమ మాతృభాష లాగానే తమిళ్ భాషను అనర్గళంగా మాట్లాడుతారు.
మన దగ్గర సాధ్యమయ్యేనా?
తెలంగాణలో పలువురు సివిల్ సర్వెంట్లకు తెలుగు రాదన్న అపవాదు ఉంది. కనీసం ఎదుటి వాళ్లు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అందులోని భావం కూడా అర్థంకాదన్న వాదనలూ ఉన్నాయి. ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ఓ సీనియర్ ఆఫీసర్ ఇంగ్లిష్ లో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు.. ‘‘మీకు తెలుగు వచ్చు కదా?! తెలుగులోనే మాట్లాడండి” అని సీఎం సూచించారు. కొందరు అధికారులు తమకు తెలుగు భాష వచ్చినప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు ఇష్టం చూపడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు తెలుగు భాషాభిమానులు ఎందరో తెలుగు ప్రాధాన్యం గురించి చెప్తున్నా.. అధికారులు కూడా తెలుగులో మాట్లాడితేనే పాలన బాగుంటుందని వాళ్లు అంటున్నా.. తమిళనాడు తరహాలో మన దగ్గర సివిల్ సర్వెంట్లు తెలుగులో అనర్గళంగా మాట్లాడటం సాధ్యమయ్యేనా? అనర్గళంగా మాట్లాడటం పక్కనపెడ్తే.. కనీసం కమ్యూనికేషన్ కోసమైనా అంతో ఇంతో మాట్లాడటం నేర్చుకుంటారా?!!
తెలుగులో జీవోలు ఎక్కడా?
జనానికి అర్థమయ్యేలా జీవోలను తెలుగులోనే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ అది అంతగా కార్యరూపం దాల్చడం లేదు. సమాచార హక్కు చట్టం(RTI) కింద ఏదైనా అంశంపై తెలుగులో దరఖాస్తు పెడ్తే కూడా సరైన సమాధానం రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆయా పనులు చేయాల్సిన కీలక అధికారులకు తెలుగు రాకపోవడమే!!
Read Also: కవిత రాజకీయ పార్టీ వెనుక సీఎం రేవంత్ రెడ్డి : ఎంపీ అరవింద్
Follow Us On: X(Twitter)


