కలం/ఖమ్మం బ్యూరో : ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. ఇండ్లు రాని వారు అధైర్య పడొద్దని.. రెండో విడత, మూడో విడతలో కచ్చితంగా వస్తాయని చెప్పారు. కచ్చితంగా లబ్ధిదారులలందరికీ న్యాయం చేస్తామన్నారు. అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 69 శాతం విజయాన్ని అందించారని స్పష్టం చేశారు.
అర్హులకు పథకాలు అందాలి
“సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఇందులో సర్పంచులు కీలక పాత్ర పోషించి, పథకాలను ఇంటింటికీ చేర్చాలి” అని మంత్రి పొంగులేటి సూచించారు. మరో మూడు విడతల్లో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. డ్వాక్రా రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యం
ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సాగు, తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు. “సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. దీని కోసం వచ్చే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిస్తాం” అని ప్రకటించారు. రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు సత్తా చాటాలని ఆయన కోరారు.అనంతరం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 3.17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Read Also: కొండగట్టు బాధితులకు సర్కార్ చేయూత..
Follow Us On: Twitter


