కలం, సినిమా: ఆస్కార్ అవార్డుల పోటీకి సిద్ధమవుతున్నాయి హోంబలే సినిమాలు. హోంబలే ఫిలింస్ నిర్మించిన మహావతార్ నరసింహా, కాంతార ఛాప్టర్ 1 సినిమా ఈ ఏడాది ఆస్కార్ (Oscar 2026) అవార్డులకు జనరల్ ఎంట్రీ సాధించాయి. దీంతో ఈ రెండు చిత్రాలు ఉత్తమ చిత్రం సహా ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ వంటి మేజర్ విభాగాల్లో ఆస్కార్ గెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. తమ సినిమాలు ఆస్కార్ కు అడుగుదూరంలో ఉన్నాయంటూ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
మహావతార్ నరసింహా యానిమేషన్ మూవీ. గతేడాది జూలై 25న మహావతార్ నరసింహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 40 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమా అనూహ్య విజయంతో తెలుగులో విజయ్ దేవరకొండ కింగ్డమ్ లాంటి సినిమాలు దెబ్బతిన్నాయి. మహావతార్ నరసింహా చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించారు. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా విజయం మరోసారి మన పురాణ ఇతిహాసాల గొప్పదనం, శక్తిని చాటింది.
సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతార ఛాప్టర్ 1 మూవీ కూడా జనరల్ కేటగిరీలో ఆస్కార్ కు పోటీ పడుతోంది. ఈ సినిమాను హీరో రిషభ్ శెట్టి తన దర్శకత్వంలో రూపొందించారు. గతేడాది అక్టోబర్ 2న రిలీజైన కాంతార ఛాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ తో పాటు పలు అవార్డులు గెల్చుకునేందుకు రెడీ అవుతోంది. అందులో ఆస్కార్ (Oscar 2026) చేరినా ఆశ్చర్యం లేదు.
Read Also: విశ్వంభర విడుదలపై సస్పెన్స్ క్లియర్!
Follow Us On: Youtube


