కలం, వెబ్ డెస్క్: టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇటీవల కోల్‌కతాలో ఐప్యాక్ కార్యాలయం మీద ఈడీ దాడులు చేయడం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా అడ్డుకోవడం తెలిసిందే. తాజాగా ఢిల్లీకి ఈ నిరసన పాకింది. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) కార్యాలయం ఎదుట టీఎంసీ ఎంపీలు నిరసన (TMC Protest) చేపట్టారు.
ఐప్యాక్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడి అన్యాయమని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీని లక్ష్యంగా చేసుకుని ఈడీ దాడులు నిర్వహిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీలు ఆరోపించారు.
మధ్యాహ్నం 2 గంటలకు మమతా బెనర్జీ కూడా నిరసనలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈడీ దాడుల అంశం ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన జాతీయ స్థాయిలో రాజకీయ వేడి పెంచుతోంది.

Read Also: అమెరికా ఆంక్షల బిల్లుపై స్పందించిన కేంద్రం
Follow Us On: X(Twitter)


